సోషల్ మీడియాలో బంగారు రేణువులు



                 



 పసిడిని వెలికితీయడం అంటే..... చెప్పుకున్నంత సులభం కాదు. కొనుక్కున్నంత ఆనందం కాదు. ధరించినంత హుందాగా ఉండదు. సగటున వందకోట్ల మట్టి రేణువుల్లో మూడంటే మూడు బంగారు రేణువులుంటాయి. వెయ్యికిలోల మట్టినితోడి శుద్ధిచేస్తేగానీ అందులోంచి 0.5 గ్రాముల బంగారం బయటపడదు.  అంతకన్నా తక్కువ దొరికితే ఇక ఆ గనితో పనిలేనట్లే. ఇప్పుడీ బంగారం కత ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే… 

*********************

ప్రస్తుతం మనవన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలు. అంటే చిన్న కుటుంబాలు. చిన్న కుటుంబాలు చింతలేని కుటుంబాలనీ మన పూర్వప్రభుత్వాలు ఇల్లెక్కి అదే పనిగా కూసి, మన మనసుల్లోకి బహుసంతానం పైనా, ఉమ్మడికుటుంబాలపైనా విముఖతను సైలెంట్ గా ఇంజెక్ట్ చేశాయి. ఫలితంగా, మానవ సంబంధాలంటే ఏమిటోకూడా తెలియని వింతతరాలు పెరిగి పెద్దవై మనముందు జడపదార్దాల్లా తిరుగుతూ, మనమెంతటి తెలివితక్కువ దద్దమ్మలమో అద్దంలాగ చూపిస్తూ వెక్కిరిస్తున్నాయి. ఈ మానవరోబోలకు తాతయ్యలూ, అమ్ముమ్మలూ, నానమ్మలూ, మామయ్యలూ, అత్తయ్యలూ, అన్నయ్యలూ, అక్కయ్యలూ,తమ్ముళ్లూ,చెల్లెళ్ళూ,బావలూ,మరదళ్ళూ ఎవరితోనూ హృదయ పూర్వ క అనుబంధాలు లేవు. గతంలో ఉన్నట్లు బడిలో ఉపాధ్యాయులతోనైనా సరైన బాంధవ్యం ఉందా అంటే లేనేలేదు. అన్నీ పూర్తిగా యాంత్రిక సంబంధాలే, ఆప్యాయతలు లేని పలకరింపులే! అన్ని సంబంధాలూ ఆర్ధిక సంబంధాలే అన్న కార్ల్ మార్క్స్ మన మెదళ్ళలో తిష్ట వేసాడు. అన్ని బంధాలూ లైంగికసంబంధాలే అన్న సిగ్మండ్ ఫ్రాయిడ్ లెక్కన, కుర్రాడుకుర్రది మాత్రమే కొద్దికాలం కలిసుం టున్నారు. 

ఈ సమాజాన్ని ఇలానే వదిలేస్తే వచ్చే విపత్తు, ప్రళయం కన్నా భయంకరంగా ఉండబోతోంది. అన్నిరకాల కాలుష్యాల వల్ల వస్తున్నా విపత్తులకన్నా, ఈ మానవ సంబంధాల వైధవ్యం… మొత్తం మానవాళికి చేయబోయే హాని సాక్షాత్తూ భస్మాసుర హస్తమే! దీనిని తక్షణమే సరిచేసుకోవాలి. అందుకోసం ఈ జడపదార్ధంలో తిరిగి హృదయాలను మొలిపించాలి. గోదాట్లో కొట్టుకెళుతున్నవాడికి, తనతోటే కొట్టుకెళుతున్న కుక్కతోకే దిక్కు! అంతకుమించిన ఆప్షన్ ఉండదు. మరి మనముందున్న ఆప్షన్స్ ఏమిటి అంటే......!   

*************

సోషల్ మీడియా లో వచ్చినవన్నీ ఉబుసుపోక చెప్పుకునే కబుర్లే ఉండవు. వెతికి పట్టుకుని వెలికితీసి వివరిస్తే, అందులోనూ ఎన్నెన్నో కథలు, వ్యధలు, మానసిక వికాస దృశ్యాలూ దొరుకుతాయి. అవన్నీ మనకెంతో దార్శనికతను, సంస్కారాన్ని నేర్పుతాయి. ఒక ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది అని అంటే అందులో ఆక్షేపించాల్సింది ఏమీ లేకపోగా అంటిపెట్టుకోవాల్సినంతటి గొప్ప ఆలోచన కూడా. దురదృష్టవశాత్తూ, వీటి సృష్టికర్తలం మేమే అని  క్లెయిమ్ చేసుకునే అవకాశమూ ఉండదు. ఒకవేళ, వారి పోస్టులో వారి పేరు ఫోన్ నెంబర్లవంటివి చక్కగా పొందుపరిచినా, వాటిని తీసేసి, తామే దాని యజమానులమని లోకం అనుకోవాలన్న తహతహతోనో, తాపత్రయంతోనో, తెలియకో కొంతమంది వాటిని షేర్ చేస్తుంటారు. అందుకే కాబోలు మన పెద్దవాళ్ళు,ప్రకృతికి, మన ముందుతరాలకు అదేపనిగా కృతజ్ఞత వెలిబుచ్చుతూ, వారిని స్మరించుకుంటూ, వీలైన ప్రతిసారి గౌరవభావాన్ని వ్యక్తపరుస్తూ, మనప్రవర్తన ఉండాలో చెప్పకనే చెప్పేవారు. మనపూర్వీకులు ఎవరూ తాము సాధించిన, అందించిన జ్ఞానసంపదకు ఎక్కడా intellectual property right claim తమదే అని క్లైమ్ చేసుకోలేదు. ఆ స్పృహతో…. సోషల్ మీడియాలో వచ్చిన, నాకు కనిపించిన, మన మనుగడకు ఎంతో పనికొస్తాయనుకున్న  సోషల్ మీడియా బంగారురేణువుల్ని, తరచుగా మన బ్లాగ్ లో పొందుపరుస్తుంటాను. వాటి క్రెడిట్ పూర్తిగా వాటిని సృష్టించిన బ్రహ్మలదే! బ్లాగు చూసే వారికి అందించిన పుణ్యం మాత్రమే నాది. 



Comments

Popular posts from this blog

ప్రకృతితో_మళ్ళీ_కలిసి_జీవిద్దాం !

ప్రకృతితో_కలిసి_మళ్ళీ_జీవిద్దాం -కొబ్బరి

సీతా నవమి