సీతా నవమి


                                            
                    


                           

 మనకు చైత్రశుద్ధనవమి సుపరిచితమే. ఆరోజు శ్రీరామనవమి. సరిగ్గానెలరోజుల తర్వాత అంటే వైశాఖశుద్ధనవమి నాడు సీతానవమి. ఆ రోజు సీతమ్మ జనకునికి దొరికినరోజు.  జానకినవమి, జానకి జయంతి,సీతాజయంతి పేర్లతోనూ మిథిల ప్రాంతవాసులు కుటుంబ పండుగగా చేసుకుంటారు. అందుకే మైథిలి, జానకి, వైదేహి అనే పేర్లతోకూడా ఆమె ప్రసిద్ధమైంది.  

స్త్రీతత్వానికి చిరునామా:   

          సంపూర్ణ స్త్రీతత్వానికి సీతాదేవి నిదర్శనం. ఆమె వ్యక్తిత్వం బహుముఖమైనది. సౌకర్యంకంటే విధిని, సౌలభ్యంకంటే గౌరవాన్ని, ప్రాపంచికశక్తికంటే ఆధ్యాత్మికబలాన్ని ఆమెఎంచుకుంది. ఆజాను బాహుడు,స్ఫురద్రూపి, అజేయుడైన శ్రీరాముడు, సీత ప్రేమానురాగాలకు, అమాయకత్వానికి, చిన్న పిల్లవాడయ్యాడు. కాబట్టే, తల్లికి దూరమైన బిడ్డలా, ఆమెఎడబాటుకు తల్లడిల్లి రోదించాడు. సీతా న్వేషణలో ఆయనలో నిబిడీకృతమైవున్న అద్భుతనైపుణ్యాలు, నేర్పరితనం బహిర్గతమయ్యాయి. నిఖిలలోకంలో ఏకపత్నీవ్రతుడంటే శ్రీరాముడన్న కీర్తియశస్సులతో  ఆచంద్రతారార్కం సీతాపతిగా మార్చుకుంది.  

అన్యోన్య దాంపత్యం:  

అర్ధనారీశ్వరుని ధనుర్బంగం ద్వారా ఒక్కటైన సీతారాములు, త్రికరణశుద్ధిగా ఒక్కటై జీవించారు. క్షీరసాగరమధనంలో మందరపర్వతం మునిగిపోకుండా కూర్మరూపంలో శ్రీమహావిష్ణువు ఎలా తన భుజస్కంధాలపై భరించాడో, సంసారసాగరమధనంలో వచ్చే ఆటుపోట్లను నేర్పుగా, సమన్వయంతో సీతాదేవి నిర్వహించింది. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మిస్వరూపం. కాబట్టే, తనభర్తకు రాజ్యాధికార స్థానంలో   అరణ్యవాసానికి వెళ్లాల్సివస్తే, భర్తసన్నిధే అసలైన అయోధ్య అని, రాజభోగాలు త్యజించి, అడవులకెళ్ళింది. అక్కడున్నంతకాలం రామునితో ప్రేమానురాగాలు పంచుకోవడమే కానీ, ఎప్పుడెప్పుడు అరణ్యవాసం పూర్తవుతుందాని ఎదురుచూడలేదు. అందుకే మనజ్ఞాపకాల్లో వారిద్దరి ఎడబాటేగుర్తున్నా, దంపతులనగానే మళ్ళీ వారేగుర్తొస్తారు. అంతలా మనసంస్కృతిలో సీతారాముల ధర్మజీవనం కలగలిసిపోయి మన కుటుంబవ్యవస్థకు వెన్నెముకలా నిలిచింది. 

స్థితప్రజ్ఞతకు చిహ్నం: 

మన స్త్రీదేవతలంతా ఆయుధాలుధరించే దర్శనమిస్తారు! ఏఆయుధమూ ధరించకుండానే, దుష్టసంహారం చేసిన శక్తిస్వరూపిణి సీతమ్మ. ఆమెను ఏనాడూ నిరాశానిస్పృహలు ఆవరించలేదు. తనస్థితికి ఎవరినీ పల్లెత్తుమాటనలేదు. అలాగని పళ్ళబిగువున భరించలేదు. చుట్టూచేరిన రాక్షసమూకను చంపేస్తానన్న హనుమంతుణ్ణి, వేధించడం రాక్షసప్రవృత్తి, మన సహజగుణమైన క్షమను కోల్పోకూడదని హితవు చెప్పివారిస్తుంది. తనను బంధించిన రావణుణ్ణి, భర్తచేతే సంహరింపచేసింది. విజ్ఞత ఎంతటికీలకమో సీతాదేవి ఆచరణతో బోధించింది. మూర్తీభవించిన ధర్మస్వరూపం శ్రీరాముడైతే, ఘనీభవించిన స్థితప్రజ్ఞస్వరూపం సీతాదేవి.

సీత జన్మస్థలి :

మిథిలరాజ్యానికి రాజధాని జనక్ పూర్. యాగం చేయడానికి జనకుడు భూమినిదున్నుతుండగా సీతాదేవి దొరికింది. జనకపూర్ కి 50కిమీ దూరంలో బీహార్ లోని సీతామర్హి జిల్లా సీతాకుండ్ ప్రాంతం సీతమ్మ జన్మస్థలి. అయోధ్యరామమందిరంలానే భారీగా ఇక్కడా సీతమ్మఆలయాన్ని నిర్మిస్తామని  కేంద్రప్రభుత్వం ప్రకటించింది.  

సీత వ్రతం:

పవిత్రత, ప్రకృతితత్వం మూర్తీభవించిన సీతాదేవి అనుగ్రహాన్ని పొందడానికై ఆరోజున వ్రతమాచరిస్తారు. ఉదయాన్నే తలారా స్నానంచేసి, సీతమ్మకు అర్చనలుచేసి, ఉపవాసముండి రాత్రికి సుందరకాండ పారాయణచేసి, ముత్తైదువులకు వాయినాలుచెల్లించి, అన్నదానం, వస్త్రదానం చేసి ప్రసాదం తీసుకుంటారు. 





Comments

Popular posts from this blog

ప్రకృతితో_మళ్ళీ_కలిసి_జీవిద్దాం !

ప్రకృతితో_కలిసి_మళ్ళీ_జీవిద్దాం -కొబ్బరి