ప్రకృతితో_కలిసి_మళ్ళీ_జీవిద్దాం -కొబ్బరి

 




తులసి మొక్క, వేప, రావి చెట్లు... ఆరోగ్యానికి, ఆధ్యాత్మికత కు, ఆక్సిజన్ కు అనుబంధమైతే...


తాటి చెట్లు మన

అవసరాలకు, ఆనందానికి, ఆహారానికి, అన్నింటికీ మించి 

ఆర్థిక స్వావలంబనకు

ఆలవాలమైంది.


కొబ్బరి చెట్టు...

దాదాపు వీటన్నిటినీ సమన్వయం చేసుకుని, అందానికి కూడా ఆధారమైన కల్పతరువు !


వీటన్నిటిని సవివరంగా చెప్పుకుందాం !


#ఆరోగ్యానికి, 


లేత కొబ్బరి నీరు, 

కొబ్బరి,

కొబ్బరి నూనె.... 

ఇలా ప్రతి రూపంలో మనకు ఆరోగ్యాన్నందిస్తోంది.


లేత కొబ్బరి నీరు 

శరీరానికి కావలసిన 

ఎన్నో థాతువులను కలిగి వుంది.


నీరసం, నిస్సత్తువ వచ్చినపుడు లేత కొబ్బరి నీరు తీసుకుంటే వచ్చే తక్షణ 

శక్తిని మనందరం.. తరచూ 

పొందే వారమే !


ముదురు కొబ్బరిలో కాల్షియం ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ కూడా ఉండటంతో సహజ విరేచన కారిగా పనిచేస్తుంది.


#ఆహారానికి, 


ఈ కొబ్బరిని తురిమి బెల్లంతో కలిపి తీసుకుంటే వచ్చే రుచి వహ్వ !


అదే కొబ్బరి తురుమును... కూరల్లోనూ, సాంబారులో వేసి లొట్టలేసుకుంటూ తింటాం.


కొబ్బరి లౌజు...కొబ్బరి ఉండలు..

బెల్లం పాకంలో తురిమిన కొబ్బరి వేసి కలిపి ఉండలు గా చేసుకుని తింటాం.

తక్కువ ఖర్చుతో పిల్లలకు అందించే ఆరోగ్యకరమైన చిరుతిండి !


ఎండు కొబ్బరి, బెల్లం, వేయించిన శనగపప్పు కలిపి చేసే కజ్జి కాయలు అద్భుతః


హోటల్స్ లో ప్రధాన చట్నీ 

కొబ్బరి దే కదా !


ముదురు కొబ్బరి నుంచి పాలు తీసి.. కొన్ని రకాల స్వీట్లలో వాడతారు.


చాలా ప్రాంతాల్లో వంటల్లోకి కొబ్బరి నూనె వాడటం మనకు తెలుసు !


ఇటీవల... కొంతమంది రోగాలు తగ్గడానికి... నేరుగా కొబ్బరి నూనె తాగమనడం... మంచి ఫలితాలు పొందటం మనకు తెలిసిందే కదా !


కోనసీమ ప్రాంతంలో కొబ్బరి కల్లు గీస్తారట ! విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా దొరికే ఈ కల్లుని గర్భిణీ స్త్రీలకు కూడా ఇస్తారట !


#అందానికి....


జుట్టు ఆరోగ్యానికి కోసం  కొబ్బరి పాలు రాసుకుంటారు ఆడవాళ్ళు !


కొబ్బరి నూనె గురించి కొత్తగా చెప్పాల్సిందేముంది ! అనాదిగా మన జుట్టు సంరక్షణ కోసం వాడుతున్నదే !


ఇంతటి అత్యాధునిక ప్రపంచంలో ఆరోగ్యకరమైన జుట్టుకు కేరాఫ్ అడ్రస్ కొబ్బరి నూనే నని.... బ్యూటీ కేర్ ఢంకా భజాయించి మరీ చెప్తోంది‌ !


#ఆధ్యాత్మికత లో :


కొబ్బరికాయ లేని శుభకార్యాన్ని ఒక్కటి చెప్పండి ?


గుడికెళ్ళి స్వామి వార్ల దర్శనం చేసుకుని, కొబ్బరికాయ మొక్కు చెల్లించి... 

గుడి బయట కూర్చుని,

అర్చకులు మనకిచ్చిన కొబ్బరి చెక్క ప్రసాదాన్ని కొట్టి, ముక్కలు చేసి..

తలా కొంచెం తీసుకుంటే కానీ....

గుడి కెళ్ళొచ్చిన అనుభూతి 

కంప్లీట్ కాదు కదూ !


ఎండు కొబ్బరి చెక్కలూ, 

ఎండు కొబ్బరి కాయలూ... 

విశేష పూజల్లో ముఖ్యమైన 

పూజా ద్రవ్యాలు !


పూర్ణాహుతి చేస్తేనే

హోమాలు, యజ్ఞాలు

పూర్తయినట్లు లెక్క !

ఆ పూర్ణాహుతిలో ఎండు కొబ్బరికాయ ముఖ్య 

ద్రవ్యం ( వస్తువు ) !


వరలక్ష్మీ శుక్రవారం నాడు అమ్మవారి ముఖాన్ని... కొబ్బరికాయతోనే చేసుకుని... మన అమ్మలూ, అమ్ముమ్మలూ, బామ్మలూ, అత్తయ్యలు, పెద్దమ్మ, చిన్నమ్మ, అత్తయ్యలు పూజ చేసుకోవడం తెలిసిందే !


#అవసరాలు - పర్యావరణ హిత వస్తువులు !


మన అవసరాలు తీర్చడంలో 

కొబ్బరి పీచు.... ఇబ్బడి ముబ్బడిగా తోడ్పడుతుంది !


పూర్వం నీటి సదుపాయాల్లో ముఖ్యమైంది ఊట బావులు‌ !


ఆ బావుల్లోంచి‌ నీరు తోడటానికి

చేద ( కొబ్బరి తాడు ) బిందెకో, బకెట్ కో కట్టి, బావిలోంచి నీరు తోడుకునేవారు మన పూర్వీకులు !


పూర్వం నీటి సదుపాయ కల్పనలో ముఖ్య వస్తువు కొబ్బరి తాడు !


ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో.... నీటి అవసరాలు బావుల ద్వారానే తీరుతున్నాయి‌ !


కొబ్బరి తాళ్ళను వివిధ సైజుల్లో తయారు చేసి, అనేక అవసరాలకు వాడుకుంటున్నాం పూర్వం నుంచీ !


పెద్ద పెద్ద మోకులు తయారు చేసి దేవుళ్ళ రథోత్సవాల్లో... రథాలు లాగడం ఇప్పటికీ మనం చేస్తున్నదే కదా !


కొబ్బరి పీచు మెత్తగా నలగ్గొట్టి, 

దేవుని రూపాలుగా రూపొందించి,

వాటికి వస్త్రాలు చుట్టి, దసరా లాంటి పర్వదినాల్లో.... ప్రత్యేక అమ్మవారి అలంకారాలు చేస్తున్నారు ఇప్పటికీ మన ఆలయాల్లో ! అద్భుతంగా ఉంటాయి ఆ రూపాలు !


#ఆనందం :


ఆ బావి చెంతనే.... 

కొబ్బరి డొప్పల్తో...

వేణ్ణీళ్ళు కాస్తూ, 

వంటినిండా కొబ్బరి నూనె 

రాసుకుని, నలుగు పెట్టుకుని,


కుంకుడు కాయల్తో తలార స్నానం చేసి, బావిలో నీరు తోడుకుని....

వేణ్ణీళ్ళకు చన్నీళ్ళు తోడు చేసి

బకెట్లకు బకెట్ల నీరు తలమీద పోసుకుంటూ... 


మా తరంతో సహా ఎంతో 

ఆనందాన్ని పొందిన వారమే !

అదొక అపూర్వ అపురూప అనుభూతి  !


పెళ్ళిళ్ళు మొదలైన శుభకార్యాలు జరిగే ఇళ్ళకు కొబ్బరి ఆకులతో నిండుగా ఉన్న మట్టల్ని కడితే వచ్చే కళ అంతా ఇంతా కాదు‌!


#ఆహ్లాదం !


కోనసీమ.... కొబ్బరాకు....

ఈ పదాలు వినగానే... మన మనసు ఆహ్లాదంలో మునిగి తేలుతుంది‌.


మన ప్రాచీన కవుల నుంచీ...

ఇప్పటి సినిమా దర్శకుల వరకు...

ఎందరికో... 

ఈ కోనసీమ ప్రాంతం... 

దానికి సుసంపన్నత చేకూర్చిన కొబ్బరి  ఎంతో కళాత్మక స్ఫూర్తి నిచ్చాయి.


మరీ ముఖ్యంగా... 

సినిమాల్లో ఈ ప్రాంతపు 

దృశ్యాలు చూసిన.... 

ఇరుగు పొరుగు ప్రాంతాల 

వారమైన మనందరికీ.... 

స్వర్గంలో విహరించిన అనుభూతి !


భారీ సెట్టింగులూ, ఫిల్మ్ సిటీలూ  ఇవ్వలేని ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందిస్తాయి కోనసీమ - కొబ్బరి చెట్లు!


వీటన్నిటి వల్ల.... 

కొన్ని ప్రాంతాల ప్రజలంతా 

కేవలం కొబ్బరి చెట్ల

పై ఆధారపడి ఇప్పటికీ

జీవిస్తున్నారు.

ఆర్థిక పరిపుష్టి పొందిన ఆ ప్రాంతాలు ఒక విలక్షణ సమున్నత సంస్కృతులకు నెలవయ్యాయి.


#అగత్యం !


ఇప్పటికీ మనం ఎన్నో కొబ్బరి పీచుతో చేసిన వస్తువులను వాడుతున్నాం !

తలుపుల ముందు కాళ్ళు తుడుచుకునే పట్టాల దగ్గర్నుంచి, ఇళ్ళు ఊడ్చే కొబ్బరి ఈనెల చీపుళ్ళు మొదలైనవి.

ఇటీవల కాలంలో పర్యావరణ స్పృహ బాగా పెరగడంతో...

ప్రపంచానికి కొబ్బరి అవసరం,

ఆవశ్యకత మరింత తెలిసి‌‌వచ్చింది.గురించి

నాచురల్ ఫైబర్ అయిన ఈ కొబ్బరి పీచు.... తాటి చెట్టు లానే.. 

ప్లాస్టిక్ కు సరైన ప్రత్యామ్నాయమని ఋజువైంది.


కాయర్ బోర్డు అనే భారత ప్రభుత్వ సంస్థ ఈ రంగంలో విశేష కృషి చేసి మరిన్ని కొత్త కొత్త ఉత్పత్తులు కనుగొంటోంది. 

నరుడు ఐఐటీ మద్రాసు వారితో ఒక అవగాహన కుదుర్చుకుని మరిన్ని పరిశోధనలకు తెరతీసింది ! 

ఇందువల్ల అంతర్జాతీయ మార్కెట్ కు అవసరమై‌న మరిన్ని ఉత్పత్తులు పుట్టుకొస్తాయి.

మన దేశంలో కొబ్బరి పంట విస్తారంగా ఉంది. కోల్పోయిన దల్లా... మన పూర్వీకుల సృజనాత్మకత !

దానిని తిరిగి ఆవాహన చేసుకుందాం !

ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడమే కాదు ! పర్యావరణాన్ని కాపాడటంలో మార్గదర్శకుల మౌదాం !

ఇదంతా మన పూర్వీకులకు 

కొట్టిన పిండే !

కానీ శతాబ్దాల భావ దాస్యంతో..

మనల్ని మనం కోల్పోయాం !

తిరిగి పొందుదాం !


#కొబ్బరి - #కల్పవృక్షం !

Comments

Popular posts from this blog

ప్రకృతితో_మళ్ళీ_కలిసి_జీవిద్దాం !

సీతా నవమి