వైవిధ్య భరితం - శివతత్త్వం
.png)
లింగరూపంలో శివునికి అభిషేకాది పూజాక్రతువులను మనం చేస్తుంటాము. ఆ రూపంలోనే ఆలయాల్లో శివుడు మనకు దర్శనమిస్తాడు. శివతత్త్వం గురించి మన ప్రాచీన వాఙ్మయంలో విస్తృతంగా వివరించబడింది. వీటిల్లో అత్యంత ప్రామాణికమైనది శైవసిద్ధాంతం. వేదాలకు ముందే ఈ సంప్రదాయం మనుగడలో ఉందని చెప్పబడుతున్నది. దానిప్రకారం శివుడు నిరాకారుడు, నిరామయుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు. సదాశివుని చతుష్షష్టి (64) స్వరూపాలను అది ఆవిష్కరించింది. ఇవి ఎంతటివైవిధ్యం కలిగి ఉన్నాయంటే, వాటి గురించి తెలుసుకునే కొద్దీ మనలో మరింత భక్తితో కూడిన పరిణతి పొంగిపొరలుతుంది. అజ్ఞాన అహంకారాలు తొలగిపోతాయి. మరొక విశేషమేమిటంటే, ఆ స్వరూపాల భంగిమల్లోని ప్రతి చిన్నఅంశం కూడా ఏదో ఒక సత్యాన్ని మనకు బోధపరుస్తూ ఉంటుంది.
లింగరూపంలో
ఎంత నిరాకారంగా కనిపిస్తాడో, వివిధరూపాల్లో అంతే సాకారస్వరూపంతో దర్శన మిస్తాడు శివుడు.
సమస్త జ్ఞానసంపదను మౌనంగానే మనకందించే దక్షిణామూర్తిగా కనిపించే శివుడు, అంతేస్థాయిలో
భిక్షాటనమూర్తిగానూ భాసిల్లుతాడు. విశ్వాన్ని పుట్టించి, నడిపించి, లయం చేసుకునే ప్రక్రియ
మొత్తాన్ని తన శరీరభంగిమలో ఇముడ్చుకున్న నటరాజుగా విరాజిల్లుతూనే, తన శరణు కోరిన భక్తుని
మరణాన్ని తొలగించే కాలాంతకమూర్తిగానూ గోచరిస్తాడు.
ఇలా
వాటి గురించి చదివితే ఒక్కొక్క మహత్వ సందర్భానికి తగ్గట్టు ఒక్కో స్వరూపాన్ని పరమశివుడు
ధరించినట్లు బోధపడుతుంది. వాటిలో అత్యంత విశిష్టమైన 25 స్వరూపాలు సాక్షాత్తూ పరమశివుని
పంచముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష ఈశానముల నుండి వెలువడ్డాయట. వీటినే పంచవింశతి
మూర్తులంటారు.
మనం
నిశితంగా గమనిస్తే, వేటిగురించి మనం నిరంతరం చింతిస్తుంటామో, దిగులు చెందుతుంటామో భయపడుతుంటామో,
కావాలని కోరుకుంటామో, ఆరాట పడుతుంటామో వాటన్నిటి పరిష్కారాలే ఈ శివస్వరూపాలని, మన చింతనకు
సమాధానం వీటిలో లభిస్తుందని అవగతమవుతుంది. ఈ శివ స్వరూపాలను ఆగమ శాస్త్రానుసారం ఆలయశిఖరభాగంలో
నిర్మిస్తారు. వీటిలో కొన్ని మనకు పరిచయమే. మహాశివరాత్రి సందర్భంగా వాటిలో కొన్నింటి గురించి
తెలుసుకుందాం.
*********************
శ్రీ లింగోద్భవమూర్తి: ఒకానొక సందర్భంలో ఆధిక్యత గురించి బ్రహ్మవిష్ణువుల
మధ్య వచ్చిన సంవాద పరిష్కారంకోసం తేజోమయ లింగరూపాన్ని ధరించి దాని ఆద్యంతాలను చూసిరమ్మని
వారిద్దరికి సూచిస్తాడు శివుడు. కనిపెట్టలేకపోయిన వారిద్దరికి ఆ లింగరూపంలోంచి ఆకారమూర్తిగా
దర్శనమిచ్చి వారిలోని భావావేశాన్ని తొలగించాడు.
అంతటి అపురూపఘట్టం కాబట్టే ఆరోజున మహాశివరాత్రి పర్వదినంగా పాటిస్తున్నాం. లింగోద్భవమూర్తిగా ఆవిర్భవించిన ఆ అర్ధరాత్రి శుభసమయంలో విశేష అభిషేకాలు
చేసుకుంటున్నాం.
***********************************
శ్రీ నటరాజమూర్తి : శివుని
లింగరూపం మనకు తెలిసిందే. లింగమధ్యే జగత్ సర్వం అని
ఆగమాలు చెబుతున్నాయి. ఈ సృష్టిమొత్తం లింగరూపంలోనే ఉందని, సృష్టి,స్థితి,లయలు మొత్తం
శక్తిమయమని ఆ శక్తి విన్యాసాలన్నీ పరమేశ్వరుని కనుసన్నల్లో జరుగుతుంటాయన్నది దాని సారాంశం.
ఆ భావాన్ని మనకు తెలియచేసే మూర్తిస్వరూపం నటరాజు. నటరాజు భంగిమను తదేకదృష్టితో నిశితంగా
గమనిస్తే, అందులోని ప్రతి చిన్నఅంశం కూడా సమస్తవిశ్వానికి సంబంధించిన అణువు, పరమాణు
వుల లక్షణాలను గోచరింపచేస్తాయి. పంచభూతలింగాలలో ఒకటై నటరాజక్షేత్రంగా విలసిల్లుతున్న
తమిళనాడులోని చిదంబర ఆలయంలో ఎన్నో విశేషాలున్నాయి. భూ అయస్కాంత క్షేత్రానికి దగ్గరలో ఉండటం, మనలోని
నవరంధ్రాలకు సంకేతంగా 9 ద్వారాలు, ఒక ఆరోగ్యవంతుడైన మనిషి ఒక రోజులో తీసుకునే
21,600ల ఊపిరిశ్వాసలకు గుర్తుగా అంతేసంఖ్యలో బంగారపురేకుల వాడటం వంటి విశేషాలు తెలుసుకున్నప్పుడు
మనకెంతో ఉత్సుకత కలుగుతుంది. ఈ స్వరూపంలో అంతటి
నిగూఢ సారాంశముంది కాబట్టే, ప్రపంచంలోనే అత్యంత
ప్రతిష్టాత్మకమైన స్విట్జర్లాండ్ భౌతికశాస్త్ర
పరిశోధనా సంస్థ(CERN)కు వాజపేయి ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం 2004లో నటరాజస్వామి విగ్రహాన్ని
బహుమతిగా అందించగా, ఆ సంస్థ కూడా అంతే వినయంతో దానిని స్వీకరించి తమ ప్రధాన కార్యాలయం
ముందు ప్రతిష్టించుకుని మన ప్రాచీన సంస్కృతిలోని శాస్త్రీయతను గుర్తించి గౌరవించింది.
***************************************
శ్రీ దక్షిణామూర్తి:
శివుడు ఆదిగురువు. మాటలతో కంటే మౌనంగానే మరింత స్పష్టంగా జ్ఞానాన్ని బోధించవచ్చని స్వామి
వారి ఈ స్వరూపసందేశం. నిజానికి గురువంటే ఇప్పుడున్న
దానికంటే విస్తృతార్ధం ఉంది. కేవలం మంచిమార్కులు తెచ్చుకోవడానికి దోహదపడేవాడు కాదు.
మనమెలా జన్మించామో, ఈ జన్మకు కారణమేమిటో, ఈ జన్మకు సార్ధకత ఏమిటో తెలుసుకుని తదనుగుణంగా
మనల్ని మనమే తీర్చిదిద్దుకోవడానికి ఉపకరించేవాడు. ఊరికి ఉత్తరాన స్మశానం ఉంటుంది. ఆ
స్మశానమే శివుని ఆవాసం. స్వామివారు దక్షిణాభిముఖుడై ఉండటం వల్లనే ఈ స్వరూపానికి దక్షిణామూర్తి
అనే పేరు వచ్చిందని చెబుతారు కానీ అంతకుమించిన ఆంతర్యం అందులో ఉన్నది. ఆయనను పూజించడానికి
మనం ఉత్తరదిక్కుకి తిరిగాలి కదా! అంటే మనం చివరికి చేరుకునే స్థలం వైపు. దానికి చేరుకునే
లోపు మనంతట మనమే స్వస్వరూప జ్ఞానం తెలుసుకోవడానికి అంటే మనం ఎలా పుట్టామో చనిపోయాక ఏమవుతామో, ఈ రెంటిమధ్యలోని
జీవితంలో మాయ మనల్ని ఏమారుస్తుందో గ్రహించి, జ్ఞానమార్గం లో జీవితాన్ని గడిపి ముక్తిని పొందేట్లు చేయడానికి స్వామివారు ఈ స్వరూపం
దాల్చారు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ఎంత పొందినప్పటికీ ఋషులు మునులకు ఇంకా కొన్ని సందేహాలకు
సమాధానాలు దొరకక పరమశివుణ్ణి వేడుకొనగా ఆయన ఈ రూపంలో అనుగ్రహించి వారి సందేహాలను పటాపంచలు
చేశారు. ఈ స్వరూపంలో స్వామివారు మర్రిచెట్టు క్రింద చిన్ముద్ర దాల్చి, చిద్విలాసం ఒలికిస్తూ,
శిష్యబృంద పరివేష్టితుడై కూర్చుని, మౌనంగా మనలో ఉన్న జ్ఞానాన్ని జాగృతం చేస్తాడు. అందుకే స్వామి వివేకానంద మనలో
ఉన్న పరిపూర్ణతను బహిర్గతపరిచేదే విద్య అని చెప్పారు. (Education is the
manifestation of perfection already in man). ఆదిశంకరాచార్య చేత ప్రకటింపబడిన శ్రీ
దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం పారాయణ చేసుకుంటే, మనలోని ప్రజ్ఞ మేల్కొని జ్ఞాన సముపార్జన
సమున్నతంగా సాగుతుంది. ప్రతి శివాలయ దక్షిణ దిక్కు విమానభాగంలో స్వామి వారు ఉంటారు.
****************************************
శ్రీ భిక్షాటనమూర్తి: మౌనంగా
చేసిన జ్ఞానబోధతో తత్త్వం తలకెక్కని మునులు, ఋషులు గతితప్పి లౌకికపరమైన వాంఛలకు, మోహావేశాలకు
లొంగి వ్యవహరిస్తుంటే, వారికి కనువిప్పు కలిగించడానికి పరమశివుడు రూపుదాల్చినదే భిక్షాటనమూర్తి.
తేజోమయ వర్ఛస్సుతో, దట్టమైన జటాజూటంతో, చిన్నవస్త్రం మాత్రమే నడుముకి ధరించి, పెనవేసుకున్న
పాములతో, ప్రశాంత, ప్రసన్నవదనంతో కపాలాన్ని చేతబట్టుకుని, నిర్వికారంగా వీధులవెంట తిరుగుతూ
భవతీ భిక్షాన్ దేహీ అని ఇంటింటికీ వెళ్ళి ఆహారాన్ని అభ్యర్థిస్తుంటే, వారిలో వారికే
కనువిప్పు కలిగి పరివర్తన చెందారు. అహంకారం పటాపంచలై తిరిగి ఋజుమార్గంలో నడిచారు. భిక్షాటనమూర్తి
చివరి మజిలీగా వారణాసి పట్టణం చేరుకుంటే, తన రాజ్యం సుభిక్షంగా ఉందని, భిక్ష కోరుతూ
తిరుగుతున్న శివుణ్ణి చూసి అది తనకు అవమానమని భావించిన కాశీ పట్టణ రాజు ఆగ్రహించాడు.
సాక్షాత్తూ శ్రీ అన్నపూర్ణ దేవి స్వామివారికి భిక్షఅందించి రాజుకి కనువిప్పు కలిగిస్తుంది.
ఎంతటి జ్ఞానసంపద ఉన్నా, ఆర్ధికసుసంపన్నంగా కొలువు దీరినా, అహం తలకెక్కితే అదంతా వృధా
అన్న ప్రాప్తకాలజ్ఞత కలిగించే స్వరూపమే భిక్షాటన మూర్తి.
****************************************
శ్రీ అర్ధనారీశ్వరమూర్తి:
స్త్రీ
పురుష మేలికలయికే సృష్టి అని, అందులో స్త్రీతత్త్వమే ప్రకృతి అని దానికి పార్వతి సంకేతమని, శివుడు పురుషునికి సంకేతమన్న
సృష్టి రహస్యాన్ని మనకు తెలియచెప్పడానికే పరమశివుడు
అర్ధనారీశ్వరరూపం దాల్చాడు. అందులో ఆయన కుడివైపున ఉంటే, అమ్మవారు ఎడమ వైపున ఉంటారు. ఇంతటి అద్భుత
ఆవిష్కార ఆంతర్యమేమిటంటే, స్త్రీ పురుషులది ఒకరినొకరు విడదీయలేని బంధమని, దానిని
ఆరోగ్యకర రీతిలో గడపడానికే భార్యాభర్తల బంధం ఏర్పడ్డదని, వారి మధ్య అన్యోన్యతే సృష్టి
పరమార్థమన్న స్పృహను మనకు బోధించడమే. అందుకే, ఇటీవలికాలంలో, పెళ్ళైన కొద్దికాలానికే
విడాకులకు దారితీస్తున్న వైవాహికబంధాల చిక్కుముళ్లు తొలగిపోవడానికి శ్రీ అర్ధనారీశ్వర
స్తోత్రపారాయణం, శివాలయ సందర్శనాన్ని పరిష్కారంగా చెబుతున్నారు. ఆధునిక సైన్స్ ప్రకారం
పురుషునిలో XY క్రోమోజోములుంటాయి. స్త్రీలో XX క్రోమోజోములుంటాయి. మగవానిలోని X క్రోమోజోమ్
మహిళ X క్రోమోజోముతో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. మగవానిలోని Yక్రోమోజోమ్,మహిళ X క్రోమోజోముతో
కలిస్తే మగపిల్లవాడు పుడతాడు. అలానే, కుడివైపు మెదడు పక్షవాతానికి గురైతే శరీరంలోని
ఎడమభాగం చచ్చుపడిపోవడం, ఎడమ వైపు మెదడు పక్షవాతానికి గురైతే, శరీరంలోని కుడిభాగం చచ్చుపడిపోవడం
వంటి అంశాలను గమనిస్తే, అర్ధనారీశ్వర స్వరూపంలోని శాస్త్రీయత మనల్ని ఆశ్చర్యచకితుల్ని
చేస్తుంది. అందుకే మహాకవి కాళిదాసు అర్థనారీశ్వర తత్త్వాన్ని… వాగర్థావివసంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే
! జగతః పితరౌ వందే
పార్వతీపరమేశ్వరౌ అని రఘువంశ కావ్య ప్రారంభంలోనే స్తుతించారు. అంటే, మాటను
- దాని అర్థాన్ని ఎలా వేరుచేయలేమో, అలా వేర్వేరు గా చూడలేని పార్వతీ పరమేశ్వరులను అనుగ్రహించమని
ప్రార్థిస్తారు.
***************************************
శ్రీ కాలసంహారమూర్తి
: ఎదుటివారు చెప్పేదాన్ని సరిగా అర్ధం చేసుకోక పోయినా,
అపార్ధం చేసుకున్నా,
సరిగా
అన్వయించుకోలేకపోయినా వచ్చే విపరిణామాలు ఎలాఉంటాయో మనకు తెలియచేయడానికే శివుడు ఈ స్వరూపం
దాల్చాడు. సప్తచిరంజీవుల్లో ఒకడైన మార్కండేయుడు.. నిజానికి శివుని వరపుత్రుడే. ఆయన
తల్లిదండ్రులైన మృకండమహర్షి దంపతులకు చాలాకాలంపాటు పిల్లలు లేకపోతే, వారు శివుని గురించి
తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమై, వృద్ధాప్యం వచ్చేవరకు జీవించే చెడ్డ పిల్లవాడు కావాలా
లేక గొప్పవాడై 16ఏళ్ళు వచ్చేవరకు జీవించి, తదుపరి చిరంజీవిగా మిగిలిపోయే కుమారుడు కావాలా
అని వారిని ప్రశ్నిస్తాడు. రెండోవాడే కావాలని వారు కోరుకుంటారు. అలా జన్మించిన మార్కండేయుడు
చిన్ననాటినుండే నిరంతర శివచింతనలో పెరుగుతాడు. శివుడు హాలాహలం స్వీకరించినందుకు కృతజ్ఞతగా
దేవతలు తమిళనాడులోని తిరుక్కడయుర్ అనే క్షేత్రంలో అమృత ఘటేశ్వరస్వామి పేరుతో లింగప్రతిష్ఠ
చేసి విశేషపూజలు చేశారు. ఆ క్షేత్రానికి చేరుకొని మార్కండేయుడు శివుణ్ణి పూజిస్తుంటాడు.
అతనికి 16 ఏళ్ళు వచ్చాక యమధర్మరాజు వస్తాడు. శివసన్నిధిలోఉన్న మార్కండేయుని ప్రాణాలు
తీసుకోవడానికి యముడు పాశంవిడువగా అది శివ లింగాన్ని తాకుతుంది. దానితో ప్రళయకాలరుద్రునిలా
ప్రత్యక్షమై యముణ్ణి సంహరిస్తాడు శివుడు. అతని కోరికమేరకు యముణ్ణి తిరిగి బ్రతికిస్తాడు.
అప్పుడు యముడు తాను చేసిన నేరమేమిటో తెలుపమని శివుణ్ణి ప్రార్ధించగా, మృకండ మహర్షికి
తానిచ్చిన వరాన్ని అర్ధం చేసుకోవడంలో పొరపడటమే ఆయన చేసిన తప్పు అని వివరిస్తాడు.
16 ఏళ్ళు వచ్చాక అతను అమరుడని, నిత్య యౌవనుడని అతనికి చావులేదన్నది తానిచ్చిన వరమని
వివరిస్తాడు. ఈ అపురూపఘట్టం జరిగిన ఆ క్షేత్రంలో నేటికీ సకల అపమృత్యుదోషాలు తొలగిపోవడానికి, ఉగ్రరధశాంతి(షష్ఠిపూర్తి),
భీమ రధ శాంతి, సహస్ర చంద్రదర్శన కార్యక్రమాలను ఈ క్షేత్రంలో విశేషంగా జరుపుకుంటుంటారు.
Comments
Post a Comment